Posts

Showing posts from March, 2018

నా బాల్యం

ఏలేటిపాడు మా ఊరు.  రంగులమయమైన జీవితం        నా కూతురికి రోజూ కథలు చెప్పాలంటే నా బాల్యం లోనుంచే ఎన్నో జ్ఞాపకాలు వెలికి వెలికి తీసి చెప్పుకుంటున్నానని ఇంతకు ముందే చెప్పాను కదా! ఆ కథల్లో  పాత్రలూ నా కూతురి పరంగానే చెప్పాలి కనుక నేను చిన్న(ప్పటి) నాన్న  గా నే ఈ కథలలో ఉంటాను.  ఏలేటిపాడు తాత (మా నాన్న) పుట్టిన ఊరనీ మేమంతా సెలవులకి అక్కడే గడిపేవారిమనీ చెప్పాను కదా! ఆ ఊళ్ళో నాలుగు గంటలకే తెల్లారుతుంది. బామ్మ గారు పడుకునేదే తక్కువ. కానీ ఎప్పుడు పడుకున్నా నాలుగు గంటలకి గడియారం మేలుకొలుపులు అవసరం లేకుండా ఆవిడ టక్కుమని నిద్ర లేచిపోయేవారు. ఆవిడ కోడళ్ళూ కూతుళ్ళూ బామ్మగారు లేచిన అలికిడి కి  నిద్రలేచి నెమ్మది నెమ్మదిగా మరో పావుగంటలో ఆవిడని చేరేవారు. గిన్నెల చప్పుళ్ళు, వాకిల్లో  చీపుళ్ళ కదలికలతో ఇల్లంతా నిద్ర లేచేది. పాపం నేల మీద వరసగా బొంతలు పరుచుకుని పడుకునే మాలాంటి పిల్లలకి ఇంక ఆలస్యం చేసే అవకాశం లేక మేమూ నిద్ర లేచి ఎవరి బొంత, దుప్పటి వారు చక్కగా మడత పెట్టి బామ్మగారు నిర్దేశించిన చోట బుద్దిగా సద్దేసి తోటలోకి వెళ్లి వేప పుల్లలతో దంత ధావనంతో మా దినచర్య  ప్రారంభించేవాళ్ళం.  పెద్ద నాన్న లాంటి కొంచె