నా బాల్యం

ఏలేటిపాడు మా ఊరు. 


రంగులమయమైన జీవితం 
  
  
నా కూతురికి రోజూ కథలు చెప్పాలంటే నా బాల్యం లోనుంచే ఎన్నో జ్ఞాపకాలు వెలికి వెలికి తీసి చెప్పుకుంటున్నానని ఇంతకు ముందే చెప్పాను కదా! ఆ కథల్లో  పాత్రలూ నా కూతురి పరంగానే చెప్పాలి కనుక నేను చిన్న(ప్పటి) నాన్న  గా నే ఈ కథలలో ఉంటాను. 

ఏలేటిపాడు తాత (మా నాన్న) పుట్టిన ఊరనీ మేమంతా సెలవులకి అక్కడే గడిపేవారిమనీ చెప్పాను కదా!

ఆ ఊళ్ళో నాలుగు గంటలకే తెల్లారుతుంది. బామ్మ గారు పడుకునేదే తక్కువ. కానీ ఎప్పుడు పడుకున్నా నాలుగు గంటలకి గడియారం మేలుకొలుపులు అవసరం లేకుండా ఆవిడ టక్కుమని నిద్ర లేచిపోయేవారు. ఆవిడ కోడళ్ళూ కూతుళ్ళూ బామ్మగారు లేచిన అలికిడి కి  నిద్రలేచి నెమ్మది నెమ్మదిగా మరో పావుగంటలో ఆవిడని చేరేవారు. గిన్నెల చప్పుళ్ళు, వాకిల్లో  చీపుళ్ళ కదలికలతో ఇల్లంతా నిద్ర లేచేది. పాపం నేల మీద వరసగా బొంతలు పరుచుకుని పడుకునే మాలాంటి పిల్లలకి ఇంక ఆలస్యం చేసే అవకాశం లేక మేమూ నిద్ర లేచి ఎవరి బొంత, దుప్పటి వారు చక్కగా మడత పెట్టి బామ్మగారు నిర్దేశించిన చోట బుద్దిగా సద్దేసి తోటలోకి వెళ్లి వేప పుల్లలతో దంత ధావనంతో మా దినచర్య  ప్రారంభించేవాళ్ళం. 

పెద్ద నాన్న లాంటి కొంచెం పెద్దవారు కర్ర పుల్లలు కొట్టి పేర్చటం, వాటిని తీసుకుని బామ్మ గారు పెద్ద పెద్ద గిన్నెలలో స్నానానికి నీళ్లు  కాచటం మొదలయ్యేది. ఆ వేడి నీళ్లు పెద్దవారికి మాత్రమే! మా పిల్లలమంతా గోచీలతో నుయ్యి దగ్గర చేరి ఎవరి నీళ్లు వారు తోడుకొని గంటలు గంటలు స్నానం చేసే వాళ్ళం. స్నానాల గది ఆడవారికీ  పెద్దవాళ్ళకీ మాత్రమే పరిమితం. ఆ విషయం ఎంతో సహజంగా ఉండేది తప్ప మాకేదో అన్యాయం జరిగిపోతుందని ఇప్పట్లా పిల్లలూ వారి పెద్దలతో సహా లబోదిబో మనే కార్యక్రమాలు ఉండేవి కాదు. ఆ మాట కొస్తే నూతి బైట బహిరంగంగా నేస్తాలతో స్నానం చేసే అదృష్టం స్వర్గం లో కూడా ఉంటుందా? ఈ రోజు టబ్బుల్లోనూ షవర్ల కింద స్నానాలు చేసే మీకు అసలు కాలువ పక్కనా నూతి  గట్టు మీదా మిగతా స్నేహితులతో ఆడుతూ పాడుతూ చేసే స్నానం గురించి ఎలా తెలుస్తుందిలే. 

మరి ఇలాగే అందంగా ప్రారంభమయ్యిన ఒక రోజు పిల్లలందరమూ వరండా అదిరిపోయేలా స్తంభాలాట ఆడుకుంటుంటే బుల్లి నాన్న "బాబోయ్ బాబోయ్"  అరుస్తూ  వీధిలోంచి  ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. బుల్లి నాన్న లాగు (ఆ మాట కొస్తే నా లాగు) జారిపోకుండా లాగుకి చెరోవైపు భుజాల మీద చుట్టుకునేలా  రెండు తాళ్లు వచ్చేవి. వదులుగా ఉండే ఆ లాగులు, వేగంగా ఎదుగుతున్న పిల్లలకి చాలా రోజులు వాడుకోవటానికి వీలుగా ఉండేవి,  అటువంటి లాగు మీద నెమ్మదిగా వయ్యారంగా పాకుకుంటూ భుజం వైపుకి వెళ్తోంది ఒక గొంగళి పురుగు. బుల్లి నాన్న కి ఆ పురుగుని ఎలా తియ్యాలో తెలియక భయంతో అరుస్తూ వచ్చాడు. అది చూడగానే పోలో మని అందరు పిల్లలూ బాబయ్యలూ దగ్గరికి వచ్చి ఏంచెయ్యాలో అని తికమకపడుతుంటే మా సుబ్బారావు బాబయ్య అదే మీ చిన్న తాత  తన మునివేళ్లతో ఆ పురుగు ఎగిరిపడేలా నెట్టాడు. బుల్లినాన్న లాగు మీంచి గుమ్మం మీద పడి ఎందుకిలా జరిగిందో అని తికమకపడుతున్న గొంగళి పురుగు మీద అందరు పిల్లలూ దాడి చేసి ఒక పెంకు ముక్కతో అణిచేసరికి ఆ పురుగు కాస్తా పాపం చచ్చిపోయి ఆకుపచ్చ రంగు ద్రవం బైటికి వచ్చింది. హే హే గోంగూర పచ్చడి అని పిల్లలంతా గలగలమని నవ్వుకుంటూ సందడి చేస్తుంటే 'ఒరేయ్ భడవల్లారా అందరూ ఇలా రండి' అని చిన్న తాత  పిలిచాడు. 

ఎప్పుడూ పిల్లలతో కలిసిపోయి వాళ్ళచేత తమాషా తమాషా పాటలు పాడించి కొత్త కొత్త ఆటలు ఆడించి ఎప్పుడూ అలరించే మా సుబ్బారావు బాబయ్యంటే అందరు పిల్లలకీ ఇష్టమే. మరి చిన్న తాత  పిలవగానే వారంతా ఉత్సాహంగా అరుగు మీద బాబయ్య చుట్టూ చేరారు. ముందు చిన్న తాత గుమ్మం దగ్గరికి  వెళ్లి చనిపోయిన గొంగళి పురుగు ని చూసి ఆ జీవం పూర్తిగా చనిపోయిందని నిర్ధారించుకుని మళ్ళీ మేమందరం కూర్చున్న చోటికి వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే బాబయ్య అంత గంభీరంగా ఉంటే మాకు కొంచెం భయం వేసింది. అందరం నిశ్శబ్దంగా బాబాయ్ ఏమి చెప్తాడో వినటానికి వేచి ఉన్నాం. 

"వీడి వంటి మీంచి ఆ పురుగు ని తోలేసాక ప్రమాదం ఇంక లేనట్టే కాదురా? అది పాపం దాని మానాన అది వెళ్ళిపోయుండేది కదా! ఆ పురుగుకి చంపెయ్యటమెందుకు?" అని అడిగాడు బాబాయ్. 

ఎవరి దగ్గరా  సమాధానం లేదు. ఎందుకంటే ఆ పురుగుని ఎందుకు చంపారో మాకెవ్వరికీ తెలియదు. సరదా అనుకుని చేసే ఇలాంటి పనులకి ముందు ఆలోచన అవసరమని మాకు అర్ధమయ్యి నిశ్శబ్దంగా ఉన్నాం. 

చివరికి ధైర్యం చేసి కిత్తా బాబయ్య అన్నాడు, "అది అక్కడే తిరుగుతుంటే ఇంకెవరి మీదికో ఎక్కుతుంది కదన్నయ్యా ! " అన్నాడు. 

"అది వంటి మీద పాకితే వాళ్లంతా దురదలే!' అన్నాడు శంఖుడు బాబయ్య. 

'అంతే కాదు ఒక సారి గోపాలం మావయ్య చెప్పులో కూర్చుని మావయ్య చూసుకోక ఆ చెప్పు తొడుక్కుంటే ఆ ముళ్ళన్నీ కాల్లో గుచ్చుకుపోయి వారల తరబడి వైద్యం చేసుకోవలసి వచ్చిందిరా సుబ్బీ' అన్నాడు చెన్నకేసు తాత.  

చిన్న తాత నోరు విప్పి "అలా అనుకుంటే ఒక పెద్ద కాగితం తీసుకుని ఆ పురుగు దానిమీదికెక్కే వరకూ ఆగి ఆ కాగితాన్ని బైట దూరంగా ఏ తోటలోనో వేసెయ్యండి రా. అది మనకేమీ అపకారం చెయ్యనప్పుడు చంపటం అనవసరం కదా!' అన్నాడు.  ఎవరూ మాట్లాడలేదు. 

ఆ నిశ్శబ్ద వాతావరణంలో మేము ఎలా సంభాషణ కొనసాగించాలా అని ఆలోచిస్తుంటే ఇంతలో అసిరయ్య వచ్చాడు. అసిరయ్య బామ్మ గారికి నమ్మిన బంటు. అతను చేయలేనిదేమీ ఉండదేమో. ఆ మధ్య కొండముచ్చులు కొన్ని వందలు వచ్చి ఊరంతా గోల చేస్తుంటే అవేవో చిత్రమైన రాళ్లతో బాణాలు వేసి వాటిని తరిమేశాడు. వాటితో కొడితే కొండముచ్చులకి ఎక్కువ నెప్పి ఉండదట. అల్లాగే తేనెపట్టు మీద పొగ పెట్టి తేనెటీగలని తరిమేసి సీసాడు తేనె సేకరించి ఇచ్చాడు. పెనుగొండ సంతకి వెళ్ళినప్పుడల్లా మా అందరికీ రకరకాల మిఠాయిలు తెచ్చేవాడు. 

"ఏమయ్యా ఏమిటి విషయం ?" అని అడిగాడు చిన్న తాత. 

"పెద్దమ్మ గారు ఎనకాలంతా పురుగులతో నిండిందంటే మంట పెట్టిద్దామని వచ్చాను బాబూ" అన్నాడు అసిరయ్య. 

"ఏమిటీ?" అని బాబయ్య ఎదో అడగబోతుంటే బామ్మ గారు వచ్చి 'అమ్మయ్య వచ్చావా పద నాయనా రోజూ ఈ గొంగళి పురుగులతో నానా బాధలు పడుతున్నాం. ఈరోజు ఏంచేస్తావో గానీ అదేదో వదిలించు' అన్నారు. 

'విషయం ఏమిటమ్మా?' అని అడిగాడు బాబయ్య.  

'ఈరోజు చూసావు కదా? ఇల్లంతా గొంగళి పురుగులే. ఇప్పుడు ఇంటి ముందు వైపు కూడా వచ్చేస్తున్నాయి'

'ఉందనీ అమ్మా!  వాటి మానాన అవి ఉంటాయి. ఆవైపు తలుపులు కొన్నాళ్ళు వేసేస్తే సరి'

'ఒరేయ్ ఒరేయ్ ఒకసారి వెనక్కి వచ్చి చూడరా! అవే నిండిపోయి మన ఇంటి గోడ కాస్త కూడా కనపడటం లేదు.  ఆ పక్కకి  వెళ్లాలంటే భయమేసి వణికిపోతున్నాం' అంది బామ్మ గారు. 

'నేను చెప్పేది కూడా అదే. అసలటువైపు వెళ్లే అవసరం అంత ఏముందమ్మా? ఈ కాసిని రోజులూ ఊరుకుందాం' అన్నాడు చిన్న తాత. 
 
'అది నిజమేలే గానీ ... అని ఆవిడ చెప్పబోతుంటే 'అమ్మా! నీ మాట నేనెప్పుడూ కాదనలేదు. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా ' అన్నాడు బాబయ్య. 

బామ్మ గారు మాట్లాడకపోతే బాబాయ్ అసిరయ్య వైపు తిరిగి ' అసిరయ్యా! ఇంటికి వెళ్ళు. మేం మళ్ళీ పిలిపిస్తాం' అని ఒక పావలా అతని చేతిలో పెట్టాడు. అసిరయ్య వెళ్ళిపోయాడు. 

ఎందుకిలా చేసాడని ప్రశ్నార్థకంగా చూస్తున్న మా అందరినీ ఉద్దేశించి చెప్పాడు చిన్న తాత. 

'ఒరేయ్ పిల్లలూ ఇదంతా మీకు విచిత్రం గా ఉండచ్చు. మీలో కొందరికి ఇంత విపరీతమయిన దయ అన్ని జీవుల మీదా చూపించాలి కదా అని కూడా అనిపించచ్చు' అన్నాడు. 

ఏమాట కా మాట. చిన్న నాన్న కి అలాగే అనిపించింది. ఒక దోమ కుడితే ఏమీ ఆలోచించకుండా చంపేస్తాం. మరి అలా చంపేసేటపుడు  ఈ తర్కం ఏమవుతుంది? 
అందుకే 'మన ఇంటిని ఈ పురుగులు పాడు చేస్తుంటే ఎలా వదిలేస్తాం?' అన్నాడు ధైర్యం చేసి. 

'మన దగ్గర ఇంటితాలూకు పత్రాలున్నాయి కనుక ఇది మన ఇల్లని అంటున్నాము. కానీ వీటికవేమీ ఉండవు. మనకన్నా ముందే ఇలాంటి ఎన్నో జీవాలు ఇక్కడ బతుకుతున్నాయి. వాటికి దస్తావేజులంటే తెలియదు. వ్రాత పత్రాలంటే తెలియదు, కానీ అమాయకంగా అవి ఇక్కడే బతుకుతున్నాయి. మనం ఆ పురుగుని నెట్టేశామనుకో. అది ఎగిరి ఎక్కడో పడుతుంది. పడిన ప్రదేశం ఒక వాహనమైతే ఆ వాహనంతో పాటు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ జీవితాన్ని కొనసాగిస్తుంది. అక్కడకి వెళ్ళిపోయాక మనమంటూ ఒకరున్నారని కూడా దానికి తెలియదు, అలాగే ఈ జీవులన్నీ బతుకుతుంటాయి. మరి తన మానాన తాను బతుకుతున్న వాటిని మంటలతో కాల్చి చంపెయ్యటం న్యాయమేనా?" అన్నాడు చిన్న తాత. 
'అది కాదు సుబ్బీ. మనం ప్రత్యేకంగా వెళ్లి వాటిని చంపటం లేదు కదా? మనకి ఇబ్బంది కలిగిస్తుంటే ....'

'నిజంగా మన ప్రాణానికి ముప్పయితే తప్పకుండా అదేపని చేస్తాం. మనకి దురదల లాంటి ఇబ్బందులుంటేనే చంపేస్తామా?' అన్నాడు చిన్న తాత. 
శ్రద్దగా వింటున్న మావైపు చూస్తూ చిన్నతాత కొనసాగించాడు. 'కుదిరితే వాటిని మరో చోటికి చేర్చాలి. లేదా కొన్నాళ్ళు ఆవైపు వెళ్లకుండా భరించాలి. మనకి కలిగేవి  చిన్న చిన్న అసౌకర్యాలు. మరి వాటికి జీవితానికి సంబంధించిన విషయం' 

'ఏమంటారు పిల్లలూ ? ఆ పురుగు నుంచి వచ్చిన గోంగూర పచ్చడి మనం తినలేం కదా!' అన్నాడు బాబాయ్. పిల్లందరూ భళ్ళుమని నవ్వారు. 

చిన్న తాత కూడా నవ్వుతూ 'మీరు చదువుకునేటప్పుడు కూడా తెలుసుకుని ఉంటారు కదా! మన పర్యావరణ వ్యవస్థలో పురుగులు, మొక్కలు, జంతువులూ కూడా మనతో పాటు ఉంటాయి. అవన్నీ వాటిమానాన బతుకుతూ ఈ పర్యావరణాన్ని సమతూకంలో ఉంచటానికి సహాయ పడతాయి' అన్నాడు. 

వాతావరణం తెలీకయ్యింది. మరి మిగతా రోజంతా హాయిగా అద్దుతూ పాడుతూ గడిపేసాం, మరి అప్పుడప్పుడు ఇంటి వెనక్కి వెళ్తే నల్లగా వళ్ళంతా వెంట్రుకలతో గునగుణమని పాకుతుండే గొంగళి పురుగుల వైపు వీలయినంత చూడకుండా వచ్చేస్తుంటాడు చిన్న నాన్న. 

మరి ఒకరోజు మేమందరం వీధిలో ఆడుకుంటుంటే 'ఒరేయ్ పిల్లలూ రండి రండి' అని పిలిచాడు చిన్న తాత. 
 
మేమందరం మెట్లెక్కి సింహద్వారం లో నుంచి ఇంటి లోపలికి వస్తుంటే 'రండి రండి' అంటూ మమ్మలిని ఇంటి వెనక్కి తీసుకెళ్తున్నాడు చిన్నతాత. ఎన్నో రోజులనుంచి గొంగళి పురుగులు నిండిన ఆ వైపుకి మేము భయంతో వెళ్లకపోయినా ఇప్పుడు చిన్నతాత దారి తీయటంతో ధైర్యంగా కదిలాము. 

మేమింకా అక్కడ వరకూ వెళ్లే లోపలే చూసాం. కొన్ని వందల సీతాకోక చిలుకలు రంగురంగుల రెక్కలు టపటప లాడిస్తూ తోటంతా ఎగురుతున్నాయి. మా తోట ఇన్ని రంగులతో ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించని మాకు ఆ దృశ్యం ఎంతో మనోహరంగా కనిపించింది. అన్ని అందమైన కీటకాలు కళ్ళకి కనువిందుగా ఎగురుతుంటే చూసి ఆనందంగా నించున్న పిల్లలందరినీ సంతోషంగా చూస్తూ చెప్పాడు చిన్న తాత  . 

"ఆరోజు మనం మంటపెట్టి కాల్చేస్తే ఈరోజు ఈ సీతాకోక చిలుకలు ఉండేవా?'


దిద్దుకోలేని తప్పు 

ఒక రోజు పొద్దున్నే బామ్మ ఒక నీళ్ల కుండీలో నీళ్లు నింపి ఇంటి ముందు పెడుతుంటే చూసి బుల్లి నాన్న అడిగాడు. 'ఎందుకమ్మా ఈ నీళ్లు?'
బామ్మ వెంటనే వాడికేసి చూసి 'ఎండా కాలం వస్తోంది కాదురా ? పక్షులూ జంతువులూ దాహంతో అలమటిస్తాయి. అవి నీలాగా నాలాగా అడిగి నీళ్లు తీసుకోవు కదా? అందుకని నీళ్లు బైట పెడుతున్నాను. వాటికి ఎప్పుడు దాహమైతే అప్పుడు తాగుతాయి. ' అంది. 
బుల్లి నాన్న కి ఎంతో చిత్రం గా అనిపించింది. 
'అయితే పక్షులు ఈ నీటిని తాగటానికి తప్పకుండా వస్తాయా?' అని అడిగాడు. 
ఎందుకు రావు? దాహం వేసినప్పుడు వస్తాయి  మనం వాటికి భయపెట్టకుండా దూరంగా ఉంటె హాయిగా నీళ్లు తాగుతాయి అంది బామ్మ. 

బుల్లి నాన్న ఎంతో ఊహించుకున్నాడు. పాల పిట్టలూ, పంచ రంగుల చిలకలూ, బుల్లి బుల్లి పిచ్చుకలూ  ఈ కుండీ దగ్గరికొచ్చి నీళ్లు తాగితే చూడటానికి ఎంత బావుంటుంది? అందులో ఒక దాన్ని నేను పెంచుకుంటాను అనుకున్నాడు. 

బుల్లి నాన్న ఇలాగే ఆలోచిస్తుంటే బామ్మ చెప్పింది. "ఒకసారి ఒక గోరింక బామ్మ పెట్టిన నీళ్ల కుండీలో నీళ్లు తాగటానికి వచ్చి నీళ్లలో పడిపోయిందిరా.  ఎన్నో కాకులు కుండీ చుట్టూ చేరి కా కా అని అరుస్తుంటే నేను చూసి నీళ్లలో తడిసిపోయిన గోరింకని బైటికి తీసి గదిలో ఉంచాను. రెక్కల మీద తడి ఆరగానే ఆ గోరింక రెక్కలు తపతపాలాడిస్తూ  తుర్రుమని ఎగిరి పారిపోయింది. 

బుల్లి నాన్న ఆశ్చర్యపోయి తర్వాత నిరాశగా అడిగాడు 'అదేమిటమ్మా! ఇంచక్కా ఆ గోరింక ని ఉంచేసుకుంటే ఎంత బాగుండేదో కదా! ఎందుకు వదిలేశావు?" . 

"అయ్యో మనకి బావుంటుందేమో గానీ వాటికి బావుండాలి కాదురా! అవి ఇంచక్కా ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగిరి కావలసిన గింజలు తిని హాయిగా ఉంటాయి. పైగా మనం మంచివాళ్ళమనీ ఏమీ చెయ్యమనీ వాటికి తెలీదుకదా. అందుకని భయపడిపోతాయి' అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది.  

బుల్లి నాన్న కి పక్షులంటే చాలా ఇష్టం. చాలా చిన్నప్పుడు ఇంకా కొత్తకొత్తగా మాటాడటం నేర్చుకున్నప్పుడే కాకులు కనపడితే కాకాయిలు కాకాయిలు అంటూ చప్పట్లు కొట్టి గెంతులు వేసేవాడు. ఆ బుల్లి బుల్లి నవ్వులు చూడటానికి బాబాయిలూ అత్తయ్యలూ కాకి కకనపడితే చాలు ఒరేయ్ కాకాయిలురా అంటూ పిలిచేవారు. కాకి నల్లగా కొంచెం పెద్దగా ఉండి కర్ణ కఠోరంగా కావ్ కావ్ మని అరిస్తే మరి పిచిక బుల్లిగా బుజ్జిగా  ఉండి కీచుకు కీచుకు మని అరుస్తుంది. బుల్లి నాన్నకి కోయిల కూడా తెలుసు. కానీ ఇప్పటివరకూ చూడలేకపోయాడు. కోయిల కూ కూ అని పాట పాడినట్టు కూసినప్పుడు కిటికీ ఎక్కి ఆ శబ్దం వస్తున్న వైపు చూస్తూనే ఉంటాడు కోయిల కనపడుతుందేమో అని. కానీ ఆ కోయిల ఎక్కడో గుబురు చెట్ల మధ్యలో కూర్చుని కూస్తూనే ఉంటుంది తప్ప పైకి ఎగరటం మాత్రం జరగలేదు. గోరింకలు మాత్రం బాగానే కనపడతాయి.  

గంట తర్వాత బామ్మ బట్టలు ఆరేయటానికి వరండా లోకి వచ్చేసరికి బుల్లి నాన్న అక్కడే ఒక గట్టు మీద కూర్చుని కనపడితే ఆశ్చర్యపోయింది. 'ఇదేమిట్రా ? సెలవుల్లో నీ స్నేహితులతో ఆదుకోకుండా ఇక్కడేం చేస్తున్నావ్?' అని అడిగింది. 
'పక్షులొస్తాయని చూస్తున్నానమ్మా' అన్నాడు బుల్లి నాన్న. వచ్చిన పక్షులు నీళ్లు తాగి వెళ్లే వరకూ అన్నింటినీ చూడాలి. 
ఓరి భగవంతుడా ! నువ్విక్కడ కాపలా కూర్చునే సరికి వచ్ఛే పక్షులూ జంతువులూ భయపడి రావటం లేదు కాబోలు. వాటిని వాటి మానాన్న వదిలెయ్యరా. నిన్నిక్కడ చూస్తే అవి రావు ' అంది 
'నేను వాటినేమీ చేయనమ్మా ఊరికే చూస్తాను' అన్నాడు బుల్లి నాన్న. 

'ఇందాకే చెప్పాను కాదురా ? ఆ విషయం వాటికేం తెలుస్తుంది? నిన్ను చూడగానే  పారిపోతాయి. వెంటనే లోపలి రా. బైటికి అలా వీధిలోకి  పోయి ఆడుకో' అంది బామ్మ. 

బుల్లి నాన్న లోపలికి  వచ్చేసాడు గానీ ఆడుకోవటానికి వీధిలోకి వెళ్ళలేదు. కిటికీ దగ్గర కొంచెం దాగినట్టుగా కూర్చుని నీళ్ల కుండీ వైపే చూస్తూ కూర్చున్నాడు. ఆటలకన్నా తనకి ఎట్టి పరిస్థితి లోనూ ఆ పక్షులని చూడటం ముఖ్యమనిపించింది. 

రెండు గంటలయినా ఒక్క పక్షి కూడా రాలేదు. 

మళ్ళీ బామ్మ మధ్యగది కి వచ్చి 'నీకు బుద్ధి  రాదురా. అన్నిపనులూ మానుకుని ఇక్కడే ఉంటే ఎలా? నేను కూరలు తెచ్చుకోవటానికి వెళ్తున్నా. జాగ్రత్త గా ఇంట్లో ఉండు' అని చెప్పి వెళ్ళింది.
బుల్లి నాన్న వెళ్లి తలుపేసుకుని మళ్ళీ మధ్య గదికిటికీ గట్టు మీద కూర్చున్నాడు. ఇంతలో చిన  నాన్న మధ్య గదిలోకి వచ్చి కిటికీ దగ్గరే కళ్లప్పజెప్పి బైటికి చూస్తున్న బుల్లి నాన్న ని చూసి ఏం చేస్తున్నావు రా  అని అడిగితె అంతా చెప్పాడు బుల్లి నాన్న. చిననాన్న కళ్ళు మెరిసాయి. 'అవునురా మనం ఒక పిట్టని పెంచుకుందాం. ఒక దుప్పటి తీసుకుని దానిమీద వేసి లోపలికి తెచ్చుకుందాం. తర్వాత అది ఇంచక్కా మన దగ్గరే ఉంటుంది. చక్కగా పాటలు పాడుతుంది. దానికి మనం గింజలూ అన్నమూ పెట్టి పోషిద్దాం'  అన్నాడు. 'అమ్మ వద్దండి కదురా' అనబోయాడు కానీ బుల్లి నాన్న కి కూడా ఒక పిట్టని పెంచుకోవాలనే కోరిక ఉంది కనుక ఇంకేమీ చెప్పకుండా చిన్న నాన్నని అనుసరించాడు. 

ఇద్దరూ లోపలికి వచ్చి ఒక పలచటి దుప్పటి తీసుకుని మధ్య గదిలోకి వస్తుంటే బోలెడన్ని కాకుల అరుపులు వినిపించాయి. వాళ్ళు పరుగెత్తుకుని వరండా దగ్గరికి వఛ్చి చూస్తే ఎన్నో కాకులు కావ్ కావ్ మని అరుస్తూ కుండీ చుట్టూ ఎగురుతున్నాయి. కొన్ని చెట్ల కొమ్మల మీదా పిట్టగోడ మీదా గట్ల మీదా కూర్చుని అరుస్తున్నాయి. అప్పుడు చూసాడు బుల్లి నాన్న. కుండీ లో నీళ్లలో ఒక పిచ్చుక మునిగి తేలుతూ రెక్కలు గబగబా ఆడిస్తూ వేగంగా కదుల్తోంది. 

అయ్యో అంటూ బుల్లి నాన్నా చిననాన్నా పరుగెత్తుకుని బైటికి వచ్చారు. కాకులన్నీ కారు కారు మని అరుస్తుంటే కొడుతున్నట్టు బెదిరిస్తూ వాటిని తరిమేశారు. అప్పుడు నీళ్లలో తడిసిన పిచుక దగ్గరికి చిన్నాన్న ఒక కర్ర పెడితే ఆ కర్ర మీదుగా ఆ పక్షి బైటికి వచ్చింది. ఒరేయ్ దీన్ని పట్టుకోవాలి దుప్పటి తీసుకురా అని అరిచాడు చిననాన్న. అప్పటికి రెక్కలు ఆడించి వంటి మీద నీళ్లు చిమ్ముకుంటున్న ఆ పిచుక ఆ అరుపులకి గబుక్కున ఎగరబోయి నీళ్ల బరువుకి కుండీ పక్కన వాలింది. చిననాన్న బైట నుంచి అడ్డుగా నిలబడితే గుమ్మం నుంచి బుల్లి నాన్న వస్తున్నాడు. ప్రాణభయంతో పిచుక ఎగిరి గుమ్మం మీదికి వెళ్లి మళ్ళీ శక్తి చాలక గడప మీద వాలింది. 

పట్టుకో అని ఇద్దరూ ఇంట్లోకి వస్తుంటే చిన్న చిన్న గా గెంతుతూ పిచుక ఇంట్లోకి వచ్చింది. 

ఒరేయ్ తలుపులు వేసేయ్ అని చిననాన్న అరుస్తూ లోపలికి వచ్చేసాడు. ఈ లోపల బుల్లి నాన్న గుమ్మం తలుపు కిటికీ తలుపులూ మూసేసాడు. అప్పటికి వంటి మీద నీళ్లు కారి శరీరం తేలికయి కొంచెం ఎగరగలిగిన పిచుక గాల్లోకి లేచింది గానీ బైటికి దారి లేక అటూ ఇటూ ఎగురుతుంటే ఇద్దరూ దాన్ని పట్టుకోవటానికి పరుగెడుతున్నారు. బుల్లి నాన్న చేతికందిన దిండు విసిరితే చిన నాన్న తువ్వాలు తో పిచుక ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బైటికి వెళ్ళటానికి దారి తెలియక  పారిపోవటానికి ఏంటో ప్రయత్నించినా ఆ బుల్లి పిచుక ఎటు పోవాలో తెలీక వేగంగా వెళ్తూ అద్దాన్ని కొట్టుకుని కింద పడిపోయింది. పిచుక నెల మీద పడగానే చిననాన్న దాని దగ్గరికెళ్లి నీరసం గా నిస్సహాయంగా నెల మీద ఉన్న పిచుక మళ్ళీ ఎగిరే లోపల మృదువుగా ఒక చేత్తో పట్టుకున్నాడు. 

చేతికి చిక్కిన పిచుక కి నెప్పి కలగ కుండా రెండు చేతులతో నెమ్మదిగా  ఆ పిట్టని చేతుల్లోకి తీసుకుంటుంటే భలే అంటూ బుల్లి నాన్న చిననాన్న ని చేరి ఆ పిచుకని ఎంతో ఉత్సాహంతో దగ్గరి నుంచి చూస్తూ ఒరేయ్ ఒక సారి నేను కూడా పట్టుకుంటా అన్నాడు. 
'ఉండరా దానికి కొంచెం వేడి కావాలి మన కుంపటి దగ్గరికి తీసుకెళ్తే వెచ్చగా ఉంటుంది' అంటూ ఆ పిచుక వైపు చూసి మాట్లాడటం ఆపేసాడు. 
చిన నాన్న చేతిలో ఉన్న పిచుకగబగబా  వణుకుతూ ఇంకా ఇంకా ముడుచుకుపోతోంది. ఆ వణుకు చలికి కాదనీ చిన్న నాన్నా బుల్లి నాన్నా అనే ఇద్దరు రాక్షసుల చేతిలో పడ్డానని పిచుక చెందుతున్న భయానికని వారికి తెలియలేదు. వడివడిగా గుండె కొట్టుకున్న చప్పుడు చిన్న నాన్న చేతుల్లోకి తెలుస్తుంటే ఆ బుల్లి బుల్లి పిచుక మెడ పక్కకి వాల్చేస్తోంది. దాని కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. వాళ్లిద్దరూ చూస్తుండగానే ఆ మూగ జీవి కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. చిన నాన్న చేతికి ఆ పిచుక శరీరం గట్టిగా తగిలింది. అంత వరకూ చిలిపిగా కిచకిచలాడుతూ ఆనందంగా ఎగురుతూ స్వేచ్ఛగా జీవించిన ఆ పక్షి లో చలనం ఆగిపోయింది. 

బుల్లి నాన్నా చిననాన్నా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. వారేమీ మాట్లాడుకోక పోయినా ఆ చూపుల భావం ఒక్కటే. 
ఈ తప్పు జీవితం లో ఎప్పుడూ చేయను అని. 



Comments